Tragedy in Gachibowli | హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో కుమారుడితో కలిసి తల్లిదండ్రులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. బత్తుల మారెడ్డి (65), ఆయన భార్య భారతి (60), వారి కుమారుడు నిశాంత్‌రెడ్డి (38) గత ఏడాది కాలంగా గౌలిదొడ్డిలోని అదే ఫ్లాట్‌లో నివాసముంటున్నారు.

అయితే ఆదివారం (నవంబర్ 8న) ఉదయం 8:40 గంటల సమయంలో ఒకే ఫ్లాట్‌లో ముగ్గురూ సూసైడ్ చేసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. కుటుంబంలో తలెత్తే  సమస్యలు ఓవైపు, మరోవైపు అనారోగ్య కారణాల వల్లే వారు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. 


ఈ మధ్య కాలంలో ఒక్కొక్కరు కాకుండా కుటుంబసభ్యులు మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనను పెరుగుతున్నాయి. చాలా వరకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటున్నాయని పోలీసులు, అధికారులు చెబుతుంటారు. మనోధైర్యంతో సమస్యల్ని పరిష్కరించుకోవాలి కానీ, చావు ఏ సమస్యకు పరిష్కారం కాదని మానసిక నిపుణులు పేర్కొంటారు.